మరిపెడ, జూలై 31 : దళారుల మాయమాటలు నమ్మి మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐదు ఎకరాల్లో బీటీ-3 పత్తి విత్తనాలు విత్తగా చేను మాడిపోయిందని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని మాకులతండా రైతులు బోడ వాల్య, రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మంగళిబండతండాకు చెందిన వాంకుడోత్ వీరన్న, మీనేశ్ మాటలు నమ్మి బీటీ- 3పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు.
అధిక దిగుబడి వస్తుందని, పత్తి చేనులో మొలిసిన గడ్డ పోవాలంటే ఎలాంటి పాటు చేయకున్నా గైసెట్ గడ్డి మందుతో కలుపు నివారించవచ్చని చెప్పడంతో వారి మాటలు నమ్మి రూ.33,600 చెల్లించి 21 బీటీ -3 పత్తి విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేసినట్టు చెప్పారు. పత్తి మొలకెత్తిన తర్వాత చేనులో విపరీతంగా గడ్డి పెరగడంతో దళారులు చెప్పిన విధంగా గైసెట్ గడ్డి మందు పిచికారీ చేయగా గడ్డితో సహా పత్తి మొలకలు మొత్తం మాడిపోయినట్టు పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు విలపిస్తున్నారు. జరిగిన మోసంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధిత రైతులు బోడ వాల్య, రమేశ్ తెలిపారు.