హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవలైబుల్ స్కూల్స్ స్కీమ్ బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడచినా రూపాయి విడుదల చేయని దుస్థితి. బెస్ట్ అవలైబుల్ స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో 26వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు ఉచిత విద్య పొందుతున్నారు. ఆ స్కీమ్‌కు సం బంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు గా నిధులు చెల్లించడంలేదు. రూ. 230 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సర్కారు పట్టించుకోకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. విద్యార్థులను పాఠశాలలకు అనుమతించలేదు. దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. బకాయిలను చెల్లించాలని సర్కారుకు అల్టిమేటం జారీచేశాయి. సీం బకాయిల్లో రూ.92 కోట్లు తక్షణం విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్టోబర్ 29న ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదలకాలేదు. సర్కారు తక్షణం స్పందించాలని బెస్ట్ అవైలబుల్ సీం పేరెంట్స్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అమర్, ప్రధాన కార్యదర్శి సటావత్ రమేశ్‌నాయక్ డిమాండ్ చేశారు.