హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవలైబుల్ స్కీమ్ స్కూళ్ల బకాయిలను దశలవారీగా విడుదల చేస్తామని, విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని పాఠశాల యాజమాన్యాలకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. పథకంలో లబ్ధిదారులైన విద్యార్థులను పాఠశాలలు తరగతులకు అనుమతించని నేపథ్యంలో సచివాలయంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నిధులను 20లోగా విడుదల చేస్తామని వెల్లడించారు.
దళిత, గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలలు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల నిర్వహణకు అత్యవసర నిధుల కింద సీఎం సహాయ నిధి నుంచి రూ.65 కోట్లను మంజూరయ్యాయని వివరించారు. ఆ నిధుల వినయోగానికి కలెక్టర్లు, సెక్రటరీలకే సీఎం అధికారాలను అప్పగించారని తెలిపారు. ఎస్సీ గురుకుల సొసైటీలో జరిగిన డిప్యూటేషన్ల అక్రమాలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు విచారణ చేయిస్తామని మంత్రి సమాధానం ఇచ్చారు. అక్రమాలు జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.