హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పోచంపల్లి చీరకు పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా ఫిదా అయ్యారు. పోచంపల్లి చీరను ధరించడమే కాకుండా, మంగళవారం ఆ ఫొటోను ట్విటర్లో పోస్టు చేశారు. ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న ఆమె ఇటీవల హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోచంపల్లి చీరను బహూకరించారు. ఆ చీరను ధరించిన ఆమె.. ‘ఇండియన్ హ్యాండ్లూమ్స్ రాక్. తెలంగాణకు చెందిన అత్యంత అందమైన పోచంపల్లి కాటన్ చీర ధరించాను. ఇటీవల ఐటీ కమిటీ టూర్లో కేటీఆర్ బహూకరించారు’ అని ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘పోచంపల్లి చేనేతను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మా బహుమతి మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లయ్ ఇచ్చారు.