గంభీరావుపేట, ఆగస్టు 5: ‘ఇందిరమ్మ ఇల్లు వస్తే సంతోషపడ్డం. పుస్తెలతాడు కుదువపెట్టి వచ్చిన పైసలతో బేస్మెంట్ దాకా కట్టుకున్నం. తీరా బిల్లు ఇవ్వకుండా అధికారులు సతాయిస్తున్నరు. వెంటనే బిల్లు ఇప్పించండి’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని దోసలగూడెం కాలనీకి చెందిన దుబాసి సౌమ్య-రాజు దంపతులు మంగళవారం ఎంపీడీవో రాజేందర్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
సౌమ్య మాట్లాడుతూ జూన్ 5న ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చారని, జూలై 2న పుస్తెలతాడు కుదువ పెట్టి ఇల్లు బేస్మెంట్ దాకా పూర్తి చేశామని చెప్పారు. అప్పటి నుంచి బిల్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేదని వాపోయారు. ఎంపీడీవోను కలిస్తే లొకేషన్ రావడంలేదని దాటేస్తున్నారని, ఇప్పటికైనా బిల్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు.