కుభీర్ : ప్రభుత్వ కొలువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించింది బేంద్రి భోజవ్వ ( Bendri Bhojavva ) . నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన బేంద్రి గణపతి,ఇంద్రబాయి దంపతులు ఇప్పటికీ రజక వృత్తి నిర్వహిస్తూ కూతురు భోజవ్వ ను ఉన్నతాభ్యాసం చేయించి ప్రోత్సహంతో పీఈటీ ( PET ) ఉద్యోగం సాధించేలా చేశారు.
భోజవ్వ గ్రామంలోని నచికేత పాఠశాలలో ఏడవ తరగతి వరకు, 8 నుంచి పదో తరగతి వరకు అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ నిర్మల్లో, డిగ్రీ జగిత్యాల సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాల చదువుకుంది. B.Ed, M.Ed వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేసింది. వరంగల్లోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీ గా ఉద్యోగం చేస్తూ ఉండగానే 2023లో కేసీఆర్ ప్రభుత్వం పీడీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలో ఆమెకు జిల్లాలో మూడో ర్యాంకు వచ్చినప్పటికీ అనివార్య కారణాలవల్ల పోస్టింగ్ దక్కలేదు.
ప్రస్తుత ప్రభుత్వం మూడు రోజుల క్రితం పీఈటీ పోస్టులను భర్తీ చేస్తూ ఫలితాలను విడుదల చేసింది. దీంతో ఆమెకు కేజీబీవీ నిర్మల్లో పోస్టింగ్ ఇచ్చారు. గురువారం ఆమె ఉద్యోగంలో జాయిన్ అయింది. పట్టుదల, కఠోర శ్రమ ద్వారా పేదరికం అడ్డంకిగా మారదని, లక్ష్యసాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె నిరూపించింది.
తమ కూతురు ప్రభుత్వ కొలువు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భోజవ్వను తాజా మాజీ సర్పంచ్ శ్రీరాముల రాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు శాలువ పూలమాలతో సత్కరించారు. భోజవ్వ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.