న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. మూడేండ్ల విరామం తర్వాత జూన్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయనే అంచనా భారతదేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. రుతుపవనాల మొదటి దీర్ఘకాలిక అంచనాను వాతావరణ శాఖ విడుదల చేసింది. దీని తర్వాత మే నెలలో రెండో అంచనా, ఆపై ఉపవిభాగాల వారీ అంచనా వెలువడనున్నది.
భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వర్షాకాలం అత్యంత కీలకమైనది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వార్షిక వర్షపాతంలో 75 శాతం వర్షాన్ని నైరుతి రుతుపవనాలు కురిపిస్తాయి. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా అంటే దీర్ఘకాల సగటు(ఎన్పీఏ)లో సుమారు 92 శాతంగా (సాధారణ వర్షపాతం 96-104 శాతం ఉంటుంది) ఉండే అవకాశం ఉంది. ఈ అంచనాలో 5 శాతం అటూఇటుగా ఉన్నప్పటికీ సీజనల్ వర్షపాతం ఎల్పీఏలో 90 నుంచి 95 శాతం మధ్య ఉండటం సాధారణం కంటే తక్కువే. ఈ కాలం రైతులకు ముఖ్యంగా వర్షాధార ఖరీఫ్ పంటలకు చాలా కీలకమైనది.
జూన్-జూలైలో తక్కువ వర్షాల వల్ల పెద్దగా ప్రభావం ఉంటుందని మేము ఊహించడం లేదు. కాని జూలై తర్వాత ఎల్ నినో ఉచ్ఛస్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున ద్వితీయార్థంలో వర్షపాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది అని భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ అన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈశాన్య వాయవ్య, దక్షిణ ద్వీపకల్ప భారత్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ సీజనల్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి గల కారణాల్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడటం ఒకటి కావచ్చని మహాపాత్ర చెప్పారు. ఐఎండీ ప్రకారం జూన్ నెలలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఎల్నినో అంటే భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. చివరిసారిగా ఎల్నినో పరిస్థితులు 2023లో ఏర్పడ్డాయి. ఎల్నినో పరిస్థితులు దేశంలో బలహీనమైన రుతుపవన గాలులు, పొడి వాతావరణంతో ముడిపడి ఉంటాయి.
భారత్లో కురిసే మొత్తం వర్షపాతంలో సుమారు 75 శాతం రుతుపవన కాలంలోనే కురుస్తుంది. అందువల్ల నీటిపారుదల, తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి ఇది అత్యంత కీలకం. దాదాపు 64 శాతం మంది భారతీయులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నికర సాగు విస్తీర్ణంలో కేవలం 55 శాతం మాత్రమే నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్నందున వ్యవసాయం ప్రధానంగా నైరుతి రుతు పవనాలపైనే ఆధారపడి ఉంటుంది.
ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా వారం కిందట ఇలాంటి అంచనాలే వెలువరించింది. ఈ రుతుపవన సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94 శాతం ఉండొచ్చని అంచనావేసింది. ఈ ఏడాది కరువు వచ్చే ముప్పు 30 శాతం ఉన్నదని తెలిపింది.