మంచిర్యాల, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొందరు రాజకీయంగా ఎదుర్కొనలేక మహిళలను అడ్డం పెట్టు కొని నీచ రాజకీయాలు చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ధ్వజమెత్తారు. మీడియా, సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన బెల్లంపల్లిలో మీడియాతో మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని, ఈ నియోజకవర్గంపై కన్నేసిన కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మం డిపడ్డారు. సోషల్ మీడియాలో అమ్మాయి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధార మైనవని తెలిపారు. అది తన నంబర్ కాదని, అసలు తాను వాట్సాప్ వాడనని చెప్పా రు. ఆరిజన్ డెయిరీ ప్రతినిధులు తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బర్రెలు కొనేందుకు లోన్లు ఇస్తామని, దాని కంటే ముందు 30 శాతం వాటా ధనం చెల్లించాలని రైతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడంతోపాటు ఖాళీ చెక్కులు తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో 22 మంది రైతులు వారిపై కేసులు నమోదు చేశారని చెప్పారు. ఆరిజన్ డెయిరీ ముఠాపై రాష్ట్ర వ్యాప్తంగా 16 చీటింగ్ కేసులు నమోదైనట్టు విచారణలో తేలిందని, వారిని జైలుకు కూడా పంపించారని, అది మనసులో పెట్టుకొని తనను టార్గెట్ చేస్తున్నారని దుర్గం చిన్నయ్య వెల్లడించారు.