రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని గనులు ఏప్రిల్ మాసంలో 78శాతం బొగ్గు ఉత్పత్తి (Coal Production ) సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చ గిరి నరేందర్( GM Narender ) తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏప్రిల్ మాసానికి ( April Month) సంబంధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు.
బెల్లంపల్లి ఏరియాలోని గనులు ఏప్రిల్ మాసంలో 3.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 78 శాతంతో 2.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందని వివరించారు. కైరగూడ ఓసీపీ వద్ద జరుగుతున్న పనుల కారణంగా ఉత్పత్తి కొంతమేరకు తగ్గిందని, దానిని అధిగమించడానికి అందరి సహకారంతో కృషి చేస్తామని అన్నారు. గోలేటి ఓసీపీ ప్రారంభోత్సవం కోసం కసరత్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అందరి సహకారంతో అధిగమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్ఓ టూ జీఎం రాజమల్లు ,డీజిఎం ఉజ్వల్ కుమార్ బెహరా, పర్సనల్ మేనేజర్ రెడ్డి మల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్ ఉన్నారు.