బోయినపల్లి, అక్టోబర్ 10 : తండ్రీకొడుకులపై తేనెటీగలు(Bee attack) దాడి చేయగా..దవాఖానలో చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు(Person died). కొడుకుతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల( Rajanna Siricilla) జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. స్తంభంపల్లి గ్రామానికి చెందిన కందాడి లచ్చిరెడ్డి(61), కందాడి నవీన్‌రెడ్డి తండ్రీకొడుకులు. లచ్చిరెడ్డి రోజువారీ మాదిరిగా గురువారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. పత్తి చేను వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో అక్కడ ఓ చెట్టుకు ఉన్న తేనెటీగ తెట్టెపై చెట్టు కొమ్మ విరిగిపడడంతో తేనెటీగలు లేచాయి. సమీపంలో ఉన్న రైతులు కందాడి లచ్చిరెడ్డి, కందాడి నవీన్‌రెడ్డి, అల్లూరి రవీందర్‌రెడ్డి, నోముల రాజిరెడ్డితోపాటు కూలీ సుభాష్‌పై దాడి చేశాయి. స్థానికులు వెంటనే వీరిని వేములవాడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ లచ్చిరెడ్డి మృతిచెందాడు. మిగిలిన రైతులు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. కొడుకు నవీన్‌రెడ్డి పుట్టెడు దుఃఖంతో దవాఖాన నుంచి ఇంటికి వచ్చి తండ్రి లచ్చిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా, పండుగ పూట తేనెటీగల దాడిలో రైతు మృతి చెందడంతో స్తంభంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.