Bear | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి ఆదివారం హల్చల్ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడడంతో జనం భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో డీమార్ట్ వెనకాల నిర్మాణంలో ఉన్న భవనంలోకి శనివారం రాత్రి ప్రవేశించి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న తండు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ఇంట్లో ఉన్న వారు ఒక్కసారిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించి ఉంటుందని పేర్కొన్నారు.
స్థానికులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, వేసవి నేపథ్యంలో ఎండవేడిని భరించలేక వన్య ప్రాణాలు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండలోనూ చిరుత గ్రామంలో సంచరించింది. వన్య ప్రాణులు ఇంట్లోకి వస్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.