ఖైరతాబాద్, డిసెంబర్ 29: తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ నాయకత్వం సీట్లు అడిగే స్థాయి నుంచి సీట్లిచ్చే స్థాయికి ఎదగాలని మాజీ స్పీకర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు. బీసీలు గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ టైమ్స్, బీసీ సమాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బీసీ కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బుడబుక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విఠల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడారు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న బీసీలు అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు.
నాటి స్వాతంత్య్ర ఉద్యమంతోపాటు వివిధ సామాజిక పోరాటాల్లో పాల్గొన్నది బీసీలేనని, కానీ, స్వాతంత్య్రానంతరం నుంచి ఆధిపత్య కులాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయని తెలిపారు. ఆ కులాలే బీసీలను చట్టసభల్లోకి వెళ్లకుండా, ఆర్థికంగా ఎదగకుండా చేశాయని ధ్వజమెత్తారు. ఏడు దశాబ్దాల్లో ఇప్పటివరకు పార్లమెంట్లో సుమారు 9 వేల మంది ఎంపీలు అయ్యారని, వారిలో స్వల్పంగానే బీసీలకు చోటు దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లోనూ జనాభా దామాషా ప్రకారం వాటా దక్కడం లేదని, కొన్ని కులాలైతే చట్టసభ ముఖమే చూడలేదని చెప్పారు. సమావేశంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, యువజన విభాగం అధ్యక్షుడు పీ సతీశ్ సాగర్, రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్‌సాగర్, ఆశౠడపు దేవేందర్, ఉమా, చంద్రశేఖర్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, మాధవ్, నల్లతీగల రాజు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
సంచార జాతుల సంక్షేమానికి కృషి
తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు కనీసం జిల్లా సరిహద్దులు దాటని కులాల వారిని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి అసెంబ్లీ, తదితర ప్రాంతాలను చూపించానని మధుసూదనాచారి గుర్తుచేశారు. స్పీకర్‌గా తన నియోజకవర్గానికి రూ.3 వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చానని, గుర్తింపులేని సంచార జాతుల సంక్షేమానికి పాటుపడ్డానని, కోతులోళ్ల సామాజిక వర్గానికి ఓ కాలనీనే ఏర్పాటు చేశానని వివరించారు.