కరీంనగర్ తెలంగాణచౌక్, జూలై 31: అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కోర్టు కేసు అడ్డంకుల పేరిట రిజర్వేషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తే గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు.
ఆగస్టు 9న ఏఐసీసీ కార్యాలయాన్ని, ఏ క్షణంలోనైనా గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ రాజ్యాధికారం కోసం బీసీ కుల సంఘాలన్నీ ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమగ్ర కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కామారెడ్డి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బీసీ సమగ్ర కులగణన సాధన యాత్ర ముంగిపు సభను బుధవారం కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ..
కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ జనాభాలో 62 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం బీసీలను విస్మరించడమేనని విమర్శించారు. కులగణన చేపట్టకుండా బీజేపీ కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ర్టానికి చెందిన బీసీ కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ బీసీ కులగణన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్ రిజర్వేషన్ల విషయంలో వెనక్కిపోతే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ సమక్షంలో మాట ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కులగణన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. జిల్లాకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాంత్ర ఐఏఎస్ అధికారి చిరంజీవులు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, జాతీయ యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.