కవాడిగూడ, ఆగస్టు 27: ఎస్సీ, ఎస్టీలకు వర్తించినట్టే బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటించాలని కోరింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఇందులో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ సంఘాల జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని చెప్పారు. అధికారంలోకి వస్తే ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహాధర్నాలో బీసీ సంఘాల నాయకులు పాండుయాదవ్, నాగుల శ్రీనివాస్‌యాదవ్, పర్వతనేని సతీశ్, కోల జనార్దన్, పిట్ల నాగేశ్, శ్రావణి, కుల్కచర్ల శ్రీనివాస్, శివమ్మ, అరుణ్‌యాదవ్, చీపురు మల్లేశ్, గోపి, ఉదయ్, సాంబశివగౌడ్, అంబాల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.