ఖైరతాబాద్, మే 2: బీసీ కులగణన చేస్తామని ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీహార్ ఎన్నికలకు ముందు జనగణనలో బీసీ కులగణన చేపడుతామని ప్రధాని మోదీ ప్రకటించారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మొండి చెయ్యి చూపించారని ధ్వజమెత్తాయి. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కులగణన చేపట్టకుండా, ఓబీసీ మహిళా సబ్ కోటా కల్పించకుండా బీసీలను ప్రధాని మోసం చేస్తున్నారని మండిపడ్డాయి. బీసీల సెగ ప్రధానికి తగిలేలా ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు చేపడుతామని హెచ్చరించాయి. శనివారం బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలోని పాలకవర్గాలకు ఎంతమంది బీసీలున్నారన్న విషయం తెలుసని, వాటిని బయటపెడితే హక్కుల గురించి ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే దాచిపెడుతున్నారని మండిపడ్డారు. బీసీల లెక్కలు తేలాలన్నా, హక్కులు రావాలన్నా రాజ్యాధికారమే ప్రధానమైనదని తెలిపారు. సమయమొచ్చినప్పుడల్లా బీసీలకు హామీలిచ్చి విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. బీసీ సంఘాలు కేవలం సమావేశాలకే పరిమితం కావద్దని, ప్రజల వద్దకు వెళ్లాలని, జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ నెలలో తెలంగాణకు వచ్చినప్పుడు జనగణనలో కులగణనపై నిలదీయాలని సూచించారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన చేపట్టి మోదీకి బీసీ సెగ ఏంటో చూపిస్తామని తెలిపారు. బీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాలని కోరారు.
రాజ్యాంగబద్ధంగా కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న రాష్ట్రంపై మోదీ తరుచూగా విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా నాడు బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన విషయం మోదీకి తెలియదా? అని నిలదీశారు. ఇటీవల బీజేపీ ఎంపీ తేజస్వీ ఉమ్మడి ఏపీ విభజనను భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చారని, అయినా ప్రధాని చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రధాని మోదీ ఈ గడ్డపై కాలుపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వీ హన్మంత రావు మాట్లాడుతూ బీసీలను నమ్మించి మోసం చేస్తున్న బీజేపీ వైఖరికి నిరసనగా ఈనెల 9 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని తెలిపారు. బీసీ కుల సం ఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ఫ్రొఫెసర్ సంగాని మల్లేశ్వర్, తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బీ మణిమంజరి, ఉప్పరి శేఖర సగర, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.