Lalit Modi : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌కు సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (Fema) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు రానున్నట్లు వెల్లడించారు.
2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు జరిగిన విదేశీ నిధుల బదిలీల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లలిత్ మోదీపై కేసు నమోదు చేసింది. అయితే ఆ నిధుల బదిలీలు కరెంట్ అకౌంట్ లావాదేవీలేనని, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీలు కాదని ట్రైబ్యునల్ స్పష్టంచేస్తూ.. ఈడీ ఆరోపణలకు ఆధారం లేదని తేల్చింది. దీంతో లలిత్ మోదీపై విధించిన ప్రధాన జరిమానాలు, ఆరోపణలు రద్దయ్యాయి.
ఈ తీర్పుతో 16 ఏళ్లుగా తాను చెబుతున్నదే నిజమని నిరూపితమైందని లలిత్ మోదీ అన్నారు. ఐపీఎల్ అభివృద్ధే తన లక్ష్యమని, ఇప్పుడు ఆ అధ్యాయం ముగిసిందని చెప్పారు. అక్టోబర్‌లో తన కుమార్తెకు బిడ్డ పుట్టిన తర్వాత భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2010లో భారత్ విడిచి వెళ్లిన లలిత్ మోదీపై ఈడీతోపాటు బీసీసీఐ, ఆదాయపు పన్ను శాఖలు కూడా పలు విచారణలు చేపట్టాయి. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్న ఆయన తాజా ట్రైబ్యునల్ తీర్పుతో భారత్‌కు తిరిగి వచ్చే మార్గం సుగమమైందని అన్నారు.