ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: బీసీల సమస్యలు, కులగణన ఉద్యమాన్ని బీఆర్ఎస్ తన భుజస్కందాలపై వేసుకుంటే ఆ పార్టీకి పూర్వవైభవం వస్తుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ రచించిన ‘కులగణన-రిజర్వేషన్లు, శాస్త్రీయ అవగాహన’ పుస్తకాన్ని జస్టిస్ ఈశ్వరయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్‌తో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలంటే బీసీల సమస్యల జెండాను ఎత్తాలని కోరారు. బీసీలు చైతన్యంతో హక్కులను సాధించుకుంటే అగ్రకులాల వారు రిజర్వేషన్లు అడిగే దశకు వస్తారని, ఆ దిశగా బీసీ ఉద్యమాలు పదునెక్కాలని పిలుపునిచ్చారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ బీసీల సమస్యల సాధనకు పార్లమెంట్లో కొట్లాడుతానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులో ఇద్దరే బీసీ మంత్రులున్నారని, మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ, మైనార్టీలు వర్గాలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని ప్రశ్నించారు. సామాజిక ఉద్యమకారుడు రౌతు కనకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల సమ్మయ్య, ఆకుల రజిత్, సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్, వనమాల చంద్రశేఖర్, ఉస్మానియా అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని తెలంగాణ ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ముదిరాజ్‌లను బీసీ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలని, మంత్రి పదవి, ఎమ్మెల్సీతోపాటు నాలుగు నామినేటెడ్ కార్పొరేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ భవనాన్ని పూర్తి చేయాలని, బీసీ కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ముదిరాజ్, మహిళా నాయకురాలు పుష్పలత, నీరజ పాల్గొన్నారు.