హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్లు పెంచాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం బీసీ, విద్యార్థి సం ఘాల నేతృత్వంలో వేలాదిమంది విద్యార్థులు మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. వారి నినాదాలతో సంక్షేమ భవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ 11 నెలల పాలనలో వేలకోట్లు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నది కానీ, విద్యార్థుల ఫీజులు విడుదల చే యడం లేదని మండిపడ్డారు. స్కాలర్షిప్లు పెంచాలని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. సంక్షేమ అధికారి చాం బర్ ముందు బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.