హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): బీసీ నేతలు, యువకులపై.. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని బీసీ జనసభ అధ్యక్షుడు డీ రాజారాం యాదవ్ ఆరోపించారు. కక్షపూరిత చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలను రాజకీయంగా అణదొక్కాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. హస్తం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం గుండాల గ్రామానికి చెందిన ఐదుగురు బీసీ యువకులపై స్థానిక కాంగ్రెస్ నేత జలపతిరెడ్డి కక్షగట్టి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, లేకపోతే బీసీ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని, ‘చలో మల్లాపూర్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.