హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్లను అగ్రకులాలు అడ్డుకోవద్దని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ టీ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేత బాలరాజుగౌడ్ సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా అగ్రకులాలు అనేక రకాలుగా కుట్రలు చేసి అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం స్థానికసంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. ఇప్పుడు ఓర్వలేక కోర్టులను ఆశ్రయించి అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. నిరుడు 34శాతం రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నాయని గుర్తుచేశారు.రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే అగ్రకులాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం ; వందూర్గూడ గిరిజనుల తీర్మానం
దండేపల్లి, అక్టోబర్ 6: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వందూర్గూడ గిరిజనులు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గ్రామ పటేల్ కోవ దౌలత్రావు మోకాశీ అధ్యక్షతన ఆదివారం అర్ధరాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ఎన్నికల బహిష్కరణ తీర్మాన కాపీలను రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవోకు అందజేశారు. నెల్కివెంకటాపూర్-వందూర్గూడ జీపీలను ఒకటే జీపీగా గుర్తించే విషయంలో అధికారులు పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నెల క్రితం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రెండు గ్రామ పంచాయతీలకు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. అందుకే తాము ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.