హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): బీసీ కళాశాల హాస్టళ్లల్లో మెస్, అద్దె, కరెంటు బిల్లులను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ఐదు నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దీంతో హాస్టళ్లకు కూరగాయలు, పప్పులు, గుడ్లు తదితర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ కాలేజీ హాస్టళ్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు.