నల్లగొండ, నవంబర్ 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ జాయింట్ యాక్షన్, సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా కల్పించే రిజర్వేషన్లు అవసరం లేదని, రాజ్యాంగపరంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.
సీఎంకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్షం నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధించేలా కృషి చేయాలని సూచించారు. రిజర్వేషన్లు సాధిస్తే బీసీలు రాష్ట్రంలో కాంగ్రెస్కు బ్రహ్మరథం పడతారని, లేదంటే రాజకీయ సమాధి చేస్తారని హెచ్చరించారు.