మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఏ మాత్రమూ చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఏ ఒక్క హామీని అమలుచేయలేదని విమర్శించారు.
బీసీ సబ్‌ప్లాన్ అమలు చేసి వారికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వారం రోజుల్లో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో ఇందుకు అనుగుణంగా నిధు లు కేటాయించాలని కోరారు. బీసీ విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయాలని, రూ. 50 కోట్లతో ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
కవి జయరాజ్‌కు అస్వస్థత
ఖైరతాబాద్, జూలై 20: ప్రముఖ కవి, గాయకుడు, గేయ రచయిత జయరాజ్ శనివారం అస్వస్థతకు గురయ్యా రు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మైల్డ్ బ్రెయిన్‌స్ట్రోక్‌గా గుర్తించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్ట ర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయనకు న్యూరో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపినట్టు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
22 నుంచి అసోచామ్ సదస్సు
హైదరాబాద్, జూలై 20: ఈ నెల 22 నుంచి 23 వరకు హైదరాబాద్ వేదికగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అసోచామ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. షార్జా ప్రభుత్వం, తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా జరుగుతున్న ఈ సమావేశాల్లో యూఏఈలో వ్యాపార అవకాశాలు, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించనున్నట్లు అసోచామ్ ఏపీ-తెలంగాణ చైర్మన్ రవి కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ర్టానికి చెందిన సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఈ సమావేశం కీలకం కానున్నదన్నారు.