హైదరాబాద్, జూలై12 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తేవడంపై బీసీ మేధావులతో రాష్ట్ర బీసీ కమిషన్ శనివారం చర్చలు జరిపింది. రాష్ట్ర క్యాబినెట్ తేవాలన్న ఆర్డినెన్స్‌పై వారు చర్చించారు. చైర్మన్ నిరంజన్ పాల్గొన్న ఈ సమావేశంలో విషయ నిపుణుల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను తీసుకున్నారు.
42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురయ్యే అవాంతరాలు, ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి రంగు, స్పెషల్ ఆఫీసర్ సతీశ్‌కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.