హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : 2014లో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలనే అంశంపై, పలు కులాల పేర్ల మార్పుపై అభ్యంతరాలను 31లోగా సమర్పించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్పారు. ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులతో చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దొమ్మర, పిచ్చుకుంట్ల, తమ్మ లి, బుడబుకల, వీరముష్టి, కుమ్మర, రజక, మేర కులాల పేర్ల మార్పుపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని నిర్ణయించారు. 2014లో తెలంగాణ బీసీ జాబితాను రూపొందించే క్రమంలో 26 కులాలను తొలగించారు. వాటజాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణతోపాటు వినతులు, అభ్యంతరాలు స్వీకరించాలని కమిషన్ నిర్ణయించింది. 15న నోటిఫికేషన్ జారీ చేయాలని, జూన్ 9,10,11న బహిరంగ విచారణ, 31 నుంచి జూన్ 13వరకు వినతులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు.