హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) / పీర్జాదిగూడ : బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహానికి బీసీ బిడ్డ బలయ్యాడు. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేసిందన్న మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబసభ్యులు, బీసీ సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారానికి చెందిన సాయి ఈశ్వరాచారి (30) స్థానికంగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ఇక బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని పీర్జాదిగూడలో ఎమ్మెల్సీ మల్లన్నను కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చాడు.
ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరసటిరోజు రమ్మన్నారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్న ఆవేదనతో అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయలైన సాయిఈశ్వరాచారిని స్థానికులు 108 సహాయంతో గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన దారుణమైన మోసంతో మనస్తాపానికి గురైన సాయి ఈశ్వరాచారి అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శిస్తూ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకనే సాయిఈశ్వరాచారి ఆహ్మహుతి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా సాయి ఈశ్వరాచారి మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కులగణన మొదలుకొని న్యాయ స్థానాల్లో నిలబడని జీవోల దాకా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్‌కు కాంగ్రెస్ సమాధి కట్టిందని ఫైర్ అయ్యారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాయిఈశ్వరాచారి మృతికి సంతాపం తెలియజేశారు. అతడి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడకు తమ్ముడు సాయి ఈశ్వరాచారి బలికావడం చాలా బాధాకరమని, ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని, రేవంత్‌రెడ్డి అధికార దాహానికి బలైపోయిన ప్రాణమిదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఆడిన రాజకీయ విష క్రీడకు బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి బలైపోయాడని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ విధానాన్ని సహించలేకనే సాయి ఈశ్వరాచారి మనస్తాపానికి గురై ప్రాణాలర్పించాడని వాపోయారు. ఇందుకు పూర్తిగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి, పార్లమెంట్లో బిల్లు పెట్టి, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు బాధ్యత తీసుకోవాలని, లేదంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం లేదని, వారు తక్షణమే రాజీనామా చేసైనా బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి మరణానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం వల్లే ఆ బిడ్డ మరణించాడని ఉద్యోగ జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. కేంద్రంతో ఒప్పించి, చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తున్నదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరిచిపోయాడని మండిపడ్డారు.
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట దొంగ నాటకమాడి, బీసీల ఓట్లు దండుకొని చివరికి ఆ వర్గాల వారికే కాంగ్రెస్ అన్యాయం చేసిందని, దాని పర్యవసానమే బీసీ బిడ్డ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మబలిదానమని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చిన హామీలిచ్చి, ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. హామీలను నెరవేర్చాలని అనేక సందర్భాల్లో బీసీ వర్గాలు ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ మోసం చేసేందుకే ప్రయత్నించింది తప్ప రిజర్వేషన్ల అమలు కోసం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోలేదని దుయ్యబట్టారు. సాయి ఈశ్వరాచారి మరణం కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చేసిన హత్యేనని, ఇకనైనా ఆ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
సాయి ఈశ్వరాచారి మరణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేత కిషోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడాన్ని జీర్ణించుకోలేకనే ఈశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ సాయి ఈశ్వరాచారి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మాహుతి చేసుకున్నాడని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారిది ముమ్మాటికే ప్రభుత్వ హత్యేనని బీసీ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇచ్చిన హామీని సర్కారు నిలబెట్టుకోకపోవడమే సాయి ఈశ్వరాచారి మరణానికి కారణమని మండిపడ్డాయి. సాయి ఈశ్వరాచారి మృతిపై బీసీ సంఘాలు, కుల సంఘాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఈశ్వరాచారి ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్ గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విషారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు.
సాయి ఈశ్వరాచారి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కనీస మానవతా దృక్పథంతో కూడా స్పందించలేదని, బీసీల బలిదానాల కన్నా పదవులు ముఖ్యమా? అని నిలదీశారు. రిజర్వేషన్లను ఎగ్గొట్టడమేగాక, మరోవైపు బీసీలపై దాడులు చేయిస్తున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఇప్పటి వరకు బర్తరఫ్ చేయక పోవడం రేవంత్ సర్కార్ కుట్ర అని మండిపడ్డారు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో మొదటి ముద్దాయి సీఎం రేవంత్‌రెడ్డేనని, కులగణన, అసెంబ్లీ తీర్మానాలు, జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరిట కాలయాపన చేసి తుదకు ఉన్న రిజర్వేషన్‌కు కూడా కోత పెట్టి కాంగ్రెస్ నయవంచన చేసిందని బీఆర్ఎస్ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘం నాయకుడు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ఇకనైనా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ముందుకువెళ్లాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, తెలంగాణ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ నేతలు డాక్టర్ ర్యాగా రుషి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, ఢిల్లీ వేదికగా ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.