రవీంద్రభారతి, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా చేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన బీసీల సమరభేరీ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 27% నుంచి 50 శాతానికి పెంచాలని, బడ్జెట్లో బీసీలకు రూ.2 లక్షల కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ షరతులను వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తాచాటాలని పిలుపునిచ్చారు. జనాభాలో 56% ఉన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవాల్సిందేనని, లేదంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పునఃపరిశీలించి, వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను తూతూ మంత్రంగా చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజరేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. కులగణన సర్వేలో కూడా కుట్రలు, కుతంత్రాలు చేసి బీసీల సంఖ్యను తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్ హన్మంతరావు, ఎమ్మెల్సీ కోదండరాం, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు నీల వెంకటేశ్ , ఆళ్ల రామకృష్ణ, అంజి, సీ రాజేందర్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.