హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): అసలు రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల లెక్కలు తేల్చాల్సిందేనని బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్వేలో పాల్గొనని లక్షలాది మందిని గుర్తించి తిరిగి సర్వే చేయించి, అసలు బీసీల లెక్కలు తే ల్చాలని కోరారు. బీసీ, ఎంబీసీ, సం చార జాతుల్లో ఉన్న బీసీ కులాలను గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోనే లేదని, వారి అభివృద్ధికి పాటుపడలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలని విజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేటి నుంచి గాంధీనాయక్ ఆమరణ దీక్ష ; స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని నిరసన
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్‌తో గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో శనివారం నుంచి దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు అనేకమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఆమరణ దీక్ష చేయాలని సంకల్పించినట్టు తెలిపారు.