నార్నూర్ : వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, సాటిలైట్ పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులు గజగజ వనికించే చలిలో చన్నీటితో స్నానాలు చేస్తూ జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళనకు గురవుతున్నారు.
ఆశ్రమ హాస్టళ్లలో సోలార్ హీటర్ పరికరాలు ఉన్నా మరమ్మతుకు గురై ఎందుకు పనికి రాకుండా పడి ఉంటున్నాయి. సోలార్ హీటర్లు గత ఐదు నెలలుగా పనిచేయక, పట్టించు కునే నాథులే లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో విద్యార్థులు ప్రతిరోజు ఉదయం చలిలో చల్లటి నీటితో స్నానం చేసేందుకు జంకుతున్నారు.
ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించి సోలార్ హీటర్లను మరమ్మతులు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.