Shamshabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి పాకిస్థాన్ జెండా ఊపాడు. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో గురువారం ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు సభ్యులు బుధవారం రాత్రి శంషాబాద్‌లో విమానం దిగి బయటకు వస్తుండగా అమెరికా సిటిజన్ షిప్ ఉన్న బషీర్ అలియాస్ చిచ్చ పాకిస్థాన్ జెండా ఊపుతూ వాళ్లకు సంఘీభావం తెలిపారు.
పాకిస్థాన్ జెండాతో కొద్దిసేపు కలవరపాటుకు గురిచేసిన ఆ వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎక్కడ క్రికెట్ అడితే అక్కడికి చిచ్చ ఒకరోజు ముందే చేరుకొని ఇలానే చేస్తున్నట్టు వెల్లడి కావడంతో అతడిని పోలీసులు వదిలేశారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదు. ఒక పక్క వినాయక నిమజ్జనోత్సవం ఉన్నా, రెండు విదేశీ జట్లు క్రికెట్ ఆడుతుండడంతో వారికి 200 మంది పోలీసు సిబ్బందితో రాచకొండ పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం విశేషం.