మహబూబాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కోట్యానాయక్ తండా, శేరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బెరైటీస్ గుట్టలను మైనింగ్ శాఖ ఏజీ నిరంజన్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘తెలంగాణ ఖనిజం ఆంధ్రాకు.. మానుకోటలో ఆగని బెరైటీస్ అక్రమ రవాణా’ కథనానికి అధికారులు స్పందించారు.
ఆంధ్రాకు తరలించేందుకు అప్పటికే సిద్ధంగా ఉన్న ఖనిజ కుప్పలను అధికారులు గుర్తించారు. ట్రాక్టర్లు, జేసీబీ యం త్రాలు లోపలికి వెళ్లకుండా పెద్ద పెద్ద కందకాలు తీయడంతో పాటు రోడ్డుకు అడ్డం గా రాళ్లకుప్పలు పోయాలని నిర్ణయించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా బెరైటీస్ తరలిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఖనిజం ఉన్న ప్రాంతానికి వెళ్లిన అధికారులు మీడియాకు వివరాలు చెప్పకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. అధికారులు జిల్లా కార్యాలయానికి చేరుకొని నివేదిక ఇవ్వగా ఉన్నతాధికారులు ఆ నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం.