Pharma City | సంగారెడ్డి సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతం కాలుష్య కాషారంగా మారుతుందని, అది తమ జీవితాలను బలితీసుకుంటుందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి. దక్షిణాసియాలోనే అదిపెద్ద పారిశ్రామికవాడ సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులోనే ఉన్నది. ఇప్పటికే పటాన్చెరు, పాశమైలారం, కాజిపల్లి, గడ్డపోతారం, ఐడీఏ బొల్లారం, సంగారెడ్డి పారిశ్రామికవాడల్లో సుమారు 200 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా 11 బడా ఫార్మా కంపెనీలు సంగారెడ్డిలో ఉన్నాయి. ఇప్పటికే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిన్నారంలో ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన కాలుష్య జలాలు తాగి బర్రెలు చనిపోతున్నాయి. ఇటీవల చిట్కుల్లోని చెరువులో చేపలు మృత్యువాతపడ్డాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీంతో జిల్లాలో నెలకొన్న ఫార్మా కంపెనీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఇలాంటి సమయంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో మరో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పచ్చని పొలాలకు నెలవుగా ఉన్న న్యాల్కల్లోని మాడ్గి, డప్పూరు, వడ్డి గ్రామాల పరిధిలోని సుమారు రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కారణంగా ఆయా గ్రామాలపై కాలుష్యం పడగ పొంచి ఉన్నది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో డప్పూరు, వడ్డీ, మాల్గి తదితర గ్రామాల్లో జ ల, వాయు కాలుష్యం సమస్యలు తలెత్తడమే కాకుండా భూగర్భ జలాలు సైతం కాలుష్యంగా మా రి విషతుల్యంగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. వడ్డి గ్రామం నుంచి పారే న్యాల్కల్వాగు, పెద్దవాగు, శాకవాగులు చినిగేపల్లి ప్రాజెక్టులో కలుస్తాయి. చినిగేపల్లి ప్రాజెక్ట్‌లోని నీరు చాల్కి మీదుగా మంజీరా నదిలో కలుస్తుంది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో మంజీరా నది జలాలు కూడా కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉన్నది. మంజీరా నదీ జలాలను సంగారెడ్డి జిల్లా ప్రజలు తాగడంతోపాటు సాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మంజీరా నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంటే వేల కుటుంబాలపై దాని దుష్ప్రభావం పడుతుందనే ఆం దోళన వ్యక్తమవుతున్నది. దీంతో ఫార్మాసి టీ ఏ ర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని న్యాల్కల్ ప్ర జలు, రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే డప్పూరు, మాడ్డి, మాల్గి శివారులో ఉన్న కొండలు మాయం కానున్నాయి. ఫార్మాసిటీ కోసం సేకరించనున్న 1,983 ఎకరాల భూముల్లో డప్పూరు, మాడ్డి, మాల్గి శివారుల్లో ఖనిజాలతో ఉన్న కొండలు ఉన్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఖనిజాలు ఉన్న ఈ కొండలు మాయం కానున్నాయి. కొండలపై ఉన్న ఆలయాలు కనుమరుగు ప్రమాదం ఉన్నది. కొండలపైన నవనాథ్ సిద్ధలింగేశ్వరస్వామి, మల్లన్నస్వామి ఆలయాలతోపాటు ఇదే ప్రాంతంలో పీర్గైబ్సాహెబ్ దర్గా ఉన్నాయి. న్యాల్కల్, జహీరాబాద్ ప్రాంత భక్తులతోపాటు బీదర్‌కు చెందిన భక్తులు ఆలయాలు, దర్గాల సందర్శనకు వస్తారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కొండలు ఉన్న భూములను సేకరిస్తుండటంతో ఆయా ఆలయాలు, దర్గాలను దర్శించుకునే భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం ఆలయాలు, దర్గాలను తొలగించడం మంచిది కాదని హితవు చెప్తున్నారు.