Lagacharla | మహబూబ్‌నగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫార్మా క్లస్టర్‌కు బీజం వేసింది కాంగ్రెస్ నేతలు! రైతుల భూముల కోసం తండాల్లోని ఆ పార్టీ నాయకులను ఎర వేసిందీ ‘అధికార’ పెద్దలే! సీఎంను కలిసేలా చేస్తామని ఐదు గ్రామాల నాయకులకు చెప్పి.. వారి ద్వారా వినతిపత్రాలంటూ రైతుల సంతకాలు తీసుకొన్నదీ వారే! ఫార్మా క్లస్టర్‌కు ఒప్పుకున్నారన్నట్టుగా ఆ సంతకాలను రైతుల సమ్మతిగా వక్రీకరించిందీ ఆ పెద్దలే! తీరా ఫార్మా అసలు గుట్టు బయటపడ్డాక.. దొంగ తీర్మానాల మోసం తెలిసివచ్చాక.. సీన్ రివర్స్ అయ్యింది. తండాలు తిరగబడ్డాయి. లగచర్ల లడాయికి దిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. రైతుల నుంచి సంతకాల సేకరణలో కీలకంగా వ్యవహరించిన ఓ కాంగ్రెస్ నాయకుడి భార్య చెప్తున్న మాటలు లగచర్ల అలజడి వెనుక సుదీర్ఘంగా, పక్కాగా పథకం అమలు చేశారని తేటతెల్లం చేస్తున్నది. లగచర్ల ఘటన తర్వాత రోటిబండతండా మాజీ సర్పంచ్ రామునాయక్ పరారీలో ఉన్నారు. ఆయన రేవంత్ అనుచరుడనీ, కాంగ్రెస్ నాయకుడనీ ఆయన భార్య రుక్కమ్మ చెప్తున్నారు. తన భర్త లగచర్ల ఘటనలో ఉన్నాడనీ, రేవంత్ టీడీపీలో ఉన్నప్పటినుంచీ ఆయన అనుచరుడిగానే ఉంటూ వచ్చాడనీ ఆమె అంటున్నారు. ఇప్పటికీ వాళ్ల ఇంట్లో రేవంత్‌రెడ్డితో రామునాయక్ దిగిన ఫొటోలు, ఇంటినిండా ఉన్న కాంగ్రెస్ జెండాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గురువారం ‘నమస్తే తెలంగాణ’ బృందం ఫార్మా క్లస్టర్ భూసేకరణపై నిజాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ సంచలనాత్మక విషయం బయటపడింది.
ఆ రోజే రైతుల ఆగ్రహం
ప్రభుత్వ అధికారులు ఫార్మా క్లస్టర్‌కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విషయం బయటపడింది. రైతులు సమ్మతించారంటూ ఓ సంతకాల పత్రం అందిన తర్వాత ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ ప్రక్రియను వేగవంతం చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత రైతుల భూముల క్రయవిక్రయాలను బ్యాంకులు బ్లాక్ చేశాయి. దీంతో ఆ భూమిపై రైతులకు రావాల్సిన రుణాలు, జరగాల్సిన రుణమాఫీ, ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న రైతులకు కొందరు కాంగ్రెస్ నేతల పన్నాగం అర్థమైంది. దీంతో భూములు ఇచ్చేది లేదని తిరగబడ్డ తండా వాసులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసి ధర్నాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. అనేకసార్లు వికారాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఎప్పుడైతే రైతులు ఆందోళనకు దిగడం ప్రారంభించారో అప్పటినుంచి కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో కనబడకుండా పోయారు.
అక్టోబర్ 25న రోటిబండతండా వద్ద తమకు ఎదురైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్‌ను రైతులు పట్టుకున్నారు. ఫార్మాకు భూములిచ్చేందుకు మేమెప్పుడు ఒప్పుకున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ‘దొంగ సంతకాల’ తీర్మానాలకు నువ్వే ముఖ్య కారకుడివంటూ దాడిచేశారు. వినతిపత్రాలంటూ సంతకాలు తీసుకుని నువ్వాడిన డ్రామా ఇదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరికి ఫోన్ చేశారో తెలియదు కానీ, పోలీసులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. రైతులనుంచి శేఖర్‌కు రక్షణ కల్పించి, తమ వెంట తీసుకెళ్లారు. వారు శేఖర్‌ను తప్పించకపోయి ఉంటే.. మహిళలు పంచాయతీ కార్యాలయం వద్ద అడ్డుపడకపోయి ఉంటే.. ఆ రోజే.. పెద్ద ఘోరం జరిగేదని తండావాసులు చెప్తున్నారు.
ఫార్మా వద్దని ఏకమైన తండాలు
కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్ వద్దని పోలేపల్లి, హకీంపేట, పులిచర్లతండా, రోటిబండతండా, లగచర్ల గ్రామాలు ఏకమయ్యాయి. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ భూములు ఇవ్వొద్దని తీర్మానించారు. భూసేకరణ వెనుక పెద్దలు ఉన్నారని, గొడవలై పోతాయని పేర్కొంటూ కొందరు బెదిరించినా.. గిరిజన రైతులు పట్టు సడిలించలేదు. తమ ప్రాణాలు పోయినా భూమి మాత్రం ఇవ్వబోమని వారంతా భీష్మించారు. రైతుల ఆగ్రహానికి భయపడిన అధికార యం త్రాం గం ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా కాకుండా గ్రా మాలకు వెలుపల చేపట్టేందుకు సిద్ధమైంది. అయి తే పోలేపల్లి, హకీంపేటల్లో అభిప్రాయ సేకరణ జరిగినా, ఫార్మాకు భూములిచ్చేది లేదని అత్యధికులు తేల్చిచెప్పారు. లగచర్ల పరిధిలోని రోటిబండతండా, పులిచర్ల తండాల గిరిజనుల ఆందోళనలకు భయపడి దుద్యాల మండల కేంద్రానికి సమీపంలో యం త్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యా రు. కాగా రైతులెవరూ దానికి రాలేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నదని, అందుకే గ్రామాల్లోకి వెళ్లి ప్రజాభిప్రాయాలు సేకరిస్తే అసలు విషయాలు తెలుస్తాయని చెప్పడంతో వారంతా లగచర్లకు చేరుకున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాసటగా..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తండాలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చాయి. రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాయి. గెలుపు సంబురాల్లో డీజేలు పెట్టుకొని రాత్రంతా డ్యాన్స్‌లూ చేశారు. రేవంత్ ఏకంగా ముఖ్యమంత్రి కావడంతో ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మరింత మురిసిపోయారు.
ఆ మాజీ సర్పంచ్ రేవంత్ అనుచరుడేనట!
ఫార్మా క్లస్టర్‌ను వ్యతిరేకిస్తూ లగచర్లలో జరిగిన ఘటనలో రోటిబండతండా మాజీ సర్పంచ్, రేవంత్ అనుచరుడు రామునాయక్ కూడా ప్రధాన పాత్ర పోషించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా, లగచర్ల ఘటన జరిగినప్పటి నుంచీ రాము పరారీలో ఉన్నారు. అయితే ఆయన పరారీలో ఉన్నాడా? లేక కాంగ్రెస్ నేతలు దాచి ఉంచారా? అనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచీ రాము ఆయన అనుచరుడిగా కొనసాగుతున్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్రలోనూ రేవంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రెండుసార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంలోనూ రేవంత్ వెంట రాము ఉన్నారు. ఆయన అండతోనే రాము రోటిబండతండా సర్పంచ్‌గానూ పనిచేశారు. తమ గృహప్రవేశానికి స్వయంగా రేవంత్ హాజరైనట్టు రాము భార్య రుక్కమ్మ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. తన భర్త రేవంత్‌కు అత్యంత సన్నిహితుడని, ఘటన జరిగినప్పటినుంచీ ఆయన పరారీలో ఉన్నాడని ఆమె చెప్తున్నారు. ప్రస్తుతం తన ఫోన్ స్విచ్ఆఫ్ వస్తున్నదని, ఎక్కడున్నాడో ఇంతవరకు ఆచూకీ లేదని రుక్కమ్మ పేర్కొన్నారు. అయితే ఇక్కడే పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మాయచేసి సంతకాలు, ఫార్మా తీర్మానాలు, రైతుల ఆగ్రహానికి కారణాలైతే.. వాటికి కారణమైన కాంగ్రెస్ నాయకులే లగచర్ల తిరుగుబాటుకూ కారణం. కానీ, నవంబర్ 11 నాటి ఘటనను మొత్తం బీఆర్ఎస్కు అంటగట్టి, ఆ ఆరోపణల జడిలో అసలు కారకులను తప్పించే ప్రయత్నమూ జరిగింది. లగచర్ల ఘటనలో సుమారు 11మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. నలుగురు మాత్రమే రిమాండ్‌లో ఉండగా, మిగిలిన వారంతా పరారీలో ఉండటం గమనార్హం.
తమకేమీ తెలియనట్టు!
లగచర్ల ఘటన తర్వాత కొందరు పెద్దలు రంగంలోకి దిగి ప్రధాన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని విమర్శలు వినవస్తున్నాయి. రైతుల తిరుగుబాటు వెనుక అసలు కారణాలను వెలుగులోకి రాకుండా వారు తొక్కిపెట్టారని, కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించారని బాధిత రైతు కుటుంబాలు చెప్తున్నాయి. ఘటన జరిగిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ కార్యకర్త సురేశ్ ప్రధాన సూత్రధారి అంటూ లీకులు వచ్చాయి. అంతటితో ఆగకుండా ఘటన జరిగిన రోజు ఆయన ఒకే ఒక్క కాల్ చేస్తే.. 80సార్లు మాజీ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఏకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపిస్తూ.. జరిగిన ఇష్యూని ఆయన మెడకు చుట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. పట్నంను ఏకంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాగా ఈ ఘటనకు సంబంధం లేని లగచర్ల గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని సైతం కేసులో ఇరికించి సస్పెండ్ చేయించారు. ఈ కుట్రల వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తమ్మీద లగచర్ల జ్వాల ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మంటలు తగ్గుతున్న కొద్దీ నిప్పును రగిల్చిన మరికొందరి గుట్టు బయటపడేలా కనిపిస్తున్నది.
ఫార్మా క్లస్టర్ తీర్మానం వెనుక..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల కిందటి నుంచే కొందరు నాయకులు పథకం ప్రకారం కథ నడుపుతూ వచ్చారని తెలుస్తున్నది. గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని, ముఖ్యమంత్రిని కలుద్దామని దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్‌తోపాటు శ్రీనివాస్ (హకీంపేట), సంజీవరెడ్డి(హకీంపేట), నర్సింహ (పోలేపల్లి), సింగర్ నర్సింహ (పోలేపల్లి) తమ గ్రామాల్లో ప్రచారం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు బస్సుల్లో హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రిని కలుద్దామని, తాను అపాయింట్మెంట్ తీసుకుంటానని శేఖర్ చెప్పి నమ్మించిండంటూ వారు చెప్తున్నారు. ఆ తర్వాత వినతిపత్రాల డ్రామా నడిపించి, కొందరు రైతుల నుంచి సంతకాలు సేకరించడం.. ఆ తర్వాత ఫార్మా క్లస్టర్‌కు అంగీకరిస్తున్నట్టుగా వాటిని తీర్మానాలుగా మలచడం చకచకా జరిగిపోయాయి.
మా ఆయన రేవంత్ మనిషే!
నా భర్త రామునాయక్ సర్పంచ్‌గా పనిచేసిండు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లమే! ఇప్పటికీ కాంగ్రెస్ జెండాలు మా ఇంట్ల పట్టకుండా ఉన్నయ్! ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పటి నుంచీ చేసినం. అప్పటి నుంచీ రేవంత్‌రెడ్డి వెనకనే ఉన్నం. రేవంత్ మా ఇంటికి కూడా వచ్చిండు. ఒకరోజంతా ఉన్నడు. ఇప్పుడు రేవంత్సారుకు ఆయన తెలుసు కదా సార్! మా పార్టోనికి ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పొచ్చు కదా! అరెస్టు చేయాలని పోలీసులు లెంకుతున్నరు. ఆయన ఎక్కడున్నాడో తెల్వదు. ఇల్లయితే ఇడిశిపెట్టి ఆపొద్దే పోయిండు. ఫోన్ బంద్ ఉన్నది.
– రుక్కమ్మ, రోటిబండతండా