రెంజల్, ఆగస్టు 2: అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాలేదంటూ రైతులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా రెంజల్‌లోని కెనరా బ్యాంకును ముట్టడించి మూడు గంటలకుపైగా ధర్నా చేశారు. స్థానిక కెనరా బ్యాంకులో వేలాది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. క్రమం తప్పకుండా రెన్యువల్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు క్రాప్ లోన్లను మాఫీ చేసింది. ఆ జాబితాలో తమ పేర్లు లేవని, ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆందోళనకు గురైన రైతులు ఆఫీసులు, బ్యాంకు చుట్టూ తిరిగినా సమాధానం దొరకలేదు.
ఆగ్రహానికి గురైన రెంజల్, దండిగుట్ట, కునేపల్లి, బాగేపల్లి, వీరన్నగుట్ట, కల్యాపూర్, వీరన్నగుట్ట, అంబేద్కర్‌నగర్, కిసాన్ తండా తదితర గ్రామాల రైతులు కెనరా బ్యాంక్ ఎదుట బైఠాయించారు. తమ రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ వచ్చి అర్హులందరికీ న్యాయం చేస్తామని, రెండ్రోజులు గడువు ఇవ్వాలని కోరడంతో వారు శాంతించారు.