కోరుట్ల, మే 11: ఉన్నత పదవిలో కొనసాగుతూ దేశ ప్రజలను రక్షించాల్సిన నాయకుడే భక్షకుడిగా మారితే ఎవరికి చెప్పుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని కొత్త బస్‌స్టాండ్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథ్‌పై మూడు రోజుల క్రితం పోక్సో కేసు నమోదైనా ఇప్పటి వరకు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. భగీరథ్ పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో రెండుసార్లు బాలిక ఆత్మహత్యకు యత్నించిందని పేర్కొన్నారు. కేసును తప్పు దారి పట్టించేందుకు సీఎం సహకరిస్తున్నాడని ఆరోపించారు.
బీజేపీ వెబ్సైట్ డౌన్ ; బండి సంజయ్ కొడుకు ఇష్యూ తర్వాత ఓపెన్ కానీ వైనం
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర కమిటీ అఫీషియల్ వెబ్సైట్ https://bjptelangana. org/ పనిచేయడం లేదు. కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంపై గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వెబ్సైట్ కూడా పని చేయకపోవడం గమనార్హం. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన వేళ సైతం వెబ్సైట్ పనిచేయకపోవడం ఏమిటి? అనే చర్చ నడుస్తున్నది. బండి భగీరథ్ పోక్సో కేసుతో కమలం పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ అంశంపై ముఖ్య నేతలంతా మౌనం దాల్చిన విషయం తెలిసిందే. విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. వెబ్‌సైట్‌ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక కారణాలతోనే వెబ్సైట్ పనిచేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.