హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాతబస్తీలోని 24 ఆలయాల్లో బోనాల పండుగకు కేవలం రూ.5 లక్షలే కేటాయిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయించి, తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగపై నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు. హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీపీసీ విద్యుత్తు అవసరం లేదా? :కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీలో ఉత్పత్తి కాబోయే విద్యుత్తు తెలంగాణకు అవసరం లేదా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని గుర్తుచేశారు. ఇందులో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతున్నదని, తెలంగాణ ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తుందని చెప్పారు.