హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గడ్డపై పుట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకపోగా.. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం కేసీఆర్ ఏడేండ్ల నుంచి కేంద్రంతో పోరాడుతున్నా బండి తొండిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతున్నది.
బండి వ్యాఖ్య: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదు.
ట్రిబ్యునల్ వేయకుండా వాటా తేలేదెలా?
ఏ రాష్ర్టానికైనా న్యాయమైన నీటి వాటా దక్కాలంటే.. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తేనే సాధ్యమవుతుంది. స్వరాష్ట్రం ఆవిర్భవించిన నెల రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత దీనికి కేంద్రం ఒప్పుకొన్నా.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించాలని మెలిక పెట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గత అక్టోబర్‌లోనే పిటిషన్‌ను ఉపసంహరించుకొన్నా.. న్యాయ సలహా పేరిట కేంద్రం నాన్చుతూనే ఉన్నది. దీన్ని కప్పిపుచ్చుతున్న సంజయ్.. రాష్ర్టానికి న్యాయమైన నీటి వాటా దక్కట్లేదని మొసలి కన్నీరు కారుస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ బోర్డుల ఆధీనంలోకి తీసుకోవాలంటూ కేంద్రానికి స్వయంగా లేఖ రాసిన బండి.. ఇప్పుడు తెలంగాణ సర్కారుపైనే విమర్శలు చేస్తుండటం బీజేపీ కపట నీతిని రుజువు చేస్తున్నది.
బండి ఆరోపణ: ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీలు పొందాల్సిన తెలంగాణ 5 టీఎంసీలు కూడా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నది.
తుమ్మిళ్ల కనిపించడం లేదా?
ఆర్డీఎస్ నుంచి పూర్తిగా 15.9 టీఎంసీల నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్టు చేపట్టింది. 10 నెలల్లోనే లిఫ్ట్‌ను పూర్తిచేసి ఆర్డీఎస్ చివరి ఆయకట్టులోని 50 వేల ఎకరాలకు 2018 నుంచి సాగునీరు ఇస్తున్నది. మరోవైపు ఆర్డీఎస్ ఆనకట్ట హెడ్‌వర్క్స్ పర్యవేక్షణ బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వ పరిధి నుంచి తొలగించి రివర్ బోర్డ్ పరిధిలోకి తీసుకోవాలని, కేఆర్ఎంబీకి తెలంగాణ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఆ ఆనకట్ట ఆధునీకరణ పనులను పూర్తిచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసినా ఉలుకూ పలుకూ లేదు. ఈ విషయంలో బండి కేంద్రాన్ని వదిలి తెలంగాణ సర్కారుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నది.
బండి ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది. ఆ డబ్బంతా ఎక్కడ?
కేంద్రం ప్రశంసలు ఉత్తవేనా?
ఉమ్మడి పాలనలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై చేసిన మొత్తం ఖర్చు రూ.38 వేల కోట్లు. గత ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం వెచ్చించినది దాదాపు రూ.1.45 లక్షల కోట్లు. రూ.2 లక్షల కోట్లు అంటూ బండి చెబుతున్నవన్నీ కాకిలెక్కలే. ఆ డబ్బంతా ఎక్కడపోయిందన్న ప్రశ్నకు కేంద్ర పరిధిలోని ‘రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఆర్ఈసీ) ఇప్పటికే సమాధానం చెప్పింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు ‘ఏ’ గ్రేడ్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థకు ‘ఏ ప్లస్’ గ్రేడ్ ఇచ్చింది. దేశంలో ఈఆర్సీ ద్వారా ఏ గ్రేడ్ సాధించిన అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరమే. మరోవైపు తెలంగాణ సాగునీటి పథకాలపై కేంద్రంతోపాటు అనేక సంస్థలు ప్రశంసలు కురిపించాయి. ఎన్నో అవార్డులు ప్రకటించాయి. అయినా నిధులన్నీ ఎక్కడికి పోయాయని బండి ప్రశ్నించడం.. కేంద్రాన్ని, ఈ సంస్థలను, ఈఆర్సీని అవమానించడమే.
బండి ఆరోపణ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ ప్రజలను మోసగిస్తున్నది.
అడ్డుకొనేదీ వారే.. అభాండాలు వేసేదీ వారే!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో ఏండ్లుగా నెలకొన్న దారిద్య్రాన్ని పారదోలేందుకు కేసీఆర్ మొక్కవోని సంకల్పంతో సాగుతున్నారు. ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేసిన జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర ప్రాజెక్టులను పూర్తిచేసి మహబూబ్‌నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన ప్రస్తుత బీజేపీ నేత నాగం జన్ధార్దన్రెడ్డి తొలుత హైకోర్టులో.. అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసిన విషయం తెలిసిందే. వీరితో బండి కూడా గొంతు కలిపారు. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదంటూ స్వయంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం లేదని ఇప్పుడు ఆయనే రాష్ట్రంపై అభాండాలు వేయడంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది.