హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్‌కు వెళ్లి, విచారణ నిమ్తితం భగీరథ్‌ను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని అతడి మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం విచారణకు పోలీసులు సిద్ధంగా ఉన్నా నిందితుడు మాత్రం హాజరుకాకుండా డుమ్మాకొట్టాడు. పైగా వ్యక్తిగత కారణాలతో తాను ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, పూర్తి ఆధారాలతో ఈ నెల 15న హాజరై పోలీసులకు సహకరిస్తానని, రెండు రోజుల గడువు ఇవ్వాలంటూ పోలీసులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నాడు. భగీరథ్ సంతకంతో ఉన్న ఆ లేఖ ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
పోక్సో కేసు ఎదుర్కొంటున్న భగీరథ్ బుధవారం పోలీసు విచారణకు హాజరుకాలేదని కేసు విచారణ ప్రత్యేక అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. బండి భగీరథ్ పేరుతో తమకు ఒక ఈ-మెయిల్ వచ్చింది వాస్తవమే కానీ దానిని పరిగణనలోకి తీసుకోబోమని ఆమె స్పష్టంచేశారు. ఆ మెయిల్‌ను నిందితుడే పంపినట్టు ఆధారమేమీ లేదని, అయినా పోక్సో కేసు విచారణకు హాజరుకావడంలో నిందితులకు ఎలాంటి మినహాయింపు లేదని చెప్పారు. విచారణకు హాజరుకానందున భగీరథ్‌పై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు పేట్ బషీరాబాద్ ఏసీపీ సీహెచ్ శంకర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రెండు బృందాలు ఢిల్లీకి వెళ్లాయని, ఒక బృందం కరీంనగర్, మరో బృందం హైదరాబాద్‌లో గాలిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. భగీరథ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇతర ఫోన్లతో సంభాషణలు చేస్తున్నాడని, కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో షెల్టర్ జోన్లో తలదాచుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో యువజన సంఘాల నేతలు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసు నమోదై ఐదు రోజులవుతున్నా ఇంతవరకూ అరెస్టు చేయకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-జక్రాన్‌పల్లి