పీయూష్ గోయల్‌ను కాపాడుకొనేందుకు అవస్థలు
అవమానించిన రెండు రోజుల తర్వాత ప్రెస్‌మీట్
హైకమాండ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే వల్లెవేసిన సంజయ్
హైదరాబాద్, మార్చి 26 : తెలంగాణ ప్రజలను నూకలు తినమంటూ అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కాపాడుకొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నానా పాట్లు పడుతున్నారు. ‘నూకల’ వివాదంపై వివరణ ఇచ్చేందుకు శనివారం మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ హైకమాండ్ ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివారు. బీజేపీ మంత్రి తెలంగాణ ప్రజలను అవమానిస్తే రెండు రోజులుగా పత్తా లేకుండా పోయిన ఆయన, శనివారం తన అవగాహనా రాహిత్యాన్ని మొత్తం బయటపెట్టుకొన్నారు.
రెండు రోజుల తర్వాత ఎందుకు?
గోయల్‌తో సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. దీనిని శనివారం బండి సంజయ్ తప్పుబట్టారు. ఎందుకు అంత ఆలస్యం చేశారంటూ ప్రశ్నించారు. అంతా డ్రామా అని విమర్శించారు. మరి.. రాష్ట్ర మంత్రులది తప్పు అని చెప్పడానికి బండికి రెండు రోజులు ఎందుకు పట్టింది? అవసరం లేకున్నా రోజూ ప్రెస్మీట్లు పెట్టి ఊదరగొట్టే బీజేపీ ఎంపీలు, నేతలు కూడా రెండు రోజులు గప్‌చుప్ అయ్యారు. హైకమాండ్ నుంచి స్క్రిప్ట్ రాలేదని రెండు రోజులు ఆగారా? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ధాన్యం ఉత్పత్తిపై వివరాలు తెలుసా?
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 7వ స్థానంలో ఉన్నదని బండి అన్నారు. ఈ నెల 23న స్వయంగా కేంద్రం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఉత్పత్తిలో టాప్‌లో ఉన్నది. ఈ నెల 15 వరకు రాష్ర్టాల నుంచి సేకరించిన ధాన్యం వివరాలనూ వెల్లడించింది. దీని ప్రకారం 2020-21లో తెలంగాణ నుంచి 141 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరించింది. 202.82 లక్షల టన్నులతో పంజాబ్ మొదటి, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2021-22లో ఇప్పటివరకు తెలంగాణ నుంచి 70.22 లక్షల టన్నులు సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది. పంజాబ్ (186.86 లక్షల టన్నులు), ఛత్తీస్‌గఢ్ (92.01 లక్షల టన్నులు) తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఈ వివరాలు తెలియకుండా బండి అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు.