హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేపట్టిన మాజీ సర్పంచులను(Former Sarpanches) అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. సమస్యను పరిష్కరించకుండా పోలీసులతో ఆందోళనలను అణదొక్కాలని చూడటం అవివేకమన్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు గుండి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాలదండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులుతోపాటు పలువురు మాజీ సర్పంచులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.