సికింద్రాబాద్, సెప్టెంబర్ 15: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. పట్టుమని 200 మంది కూడా పాదయాత్రలో లేకపోవడంతో కమలం నేతలే విస్మయానికి గురయ్యారు. జనం లేకపోవడంతో గురువారం ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోకి రావాల్సిన యా త్ర సుమారు 3 గంటలు ఆలస్యంగా నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లిలోకి ప్రవేశించింది. పాదయాత్ర సాగిన బోయిన్పల్లి, జయానగర్, నూతన్కాలనీ, సరోజినీ పుల్లారెడ్డి హౌస్, బాపూజీనగర్ నుంచి ఆశోకా గార్డెన్స్‌కు వరకు దారిలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు కూడా రాలేదు. దీంతో పాదయాత్రలో పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు తప్ప పెద్దగా జనం కనిపించలేదు. రోడ్ల వెంట వెళ్లే వాహనదారులకే దండాలు పెట్టుకుంటూ పాదయాత్రను కొనసాగించారు.
ప్రజలను పలకరించని యాత్ర..
సాధారణంగా పాదయాత్ర చేసే క్రమంలో ప్రజలను పలకరిస్తూ, కష్టాలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకుసాగుతుంటారు. కానీ బండి సంజయ్ యాత్రలో అలాంటి దృశ్యాలు ఎక్కడా కనిపించకపోవడంతో పార్టీ క్యాడరే ముక్కున వేలేసుకుంటున్నది. పాదయాత్రకు జనాలు లేకపోవడంతో బీజేపీ నేతలు అడ్డా కూలీలతో యాత్రను కొనసాగించారు. బోయిన్పల్లి సెంటర్ పాయింట్ చౌరస్తాలోని అడ్డా కూలీలతోపాటు అన్నానగర్‌లోని పలు బస్తీలవాసులకు ఒక్కొక్కరికీ రూ.500 ఇచ్చి మరీ వారి మెడలో కండువా, చేతిలో జెండా పట్టించారు.
బీజేపీలో భగ్గుమన్న విభేదాలు
మల్కాజిగిరి బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బండి పాదయాత్ర శుక్రవారం మల్కాజిగిరికి రానున్న నేపథ్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు నాయకులను సస్పెండ్ చేయాలనే విషయం తెరపైకి వచ్చింది. సమావేశంలో లేని సదరు వ్యక్తి ఈ విషయం తెలుసుకొని ఆగమేఘాల మీద మల్కాజిగిరి చౌరస్తాకు వచ్చి తిట్లపురాణం ఎత్తుకున్నారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వచ్చి దగ్గరలోని ఓ షాపులో కూర్చున్నారు. గొడవకు దిగిన బీజేపీ నాయకుడు బాబుసింగ్‌ను ఆయన వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. గొడవ ఎక్కువ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేయగా, బాబుసింగ్ అక్కడి నుంచి జారుకున్నారు. మరి శుక్రవారం యాత్ర సజావుగా జరిగేనా? అని నాయకులు తలలు పట్టుకున్నారు.