హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమైన ఐక్య కార్యాచరణ సమితి పలు డిమాండ్లను వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిషరించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చి నేడు విస్మరించిందని మండిపడింది. డీఎస్సీ ని 45 రోజులపాటు వాయిదా వేయాలని, టెట్‌ను నార్మలైజేషన్ చేయాలని, నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, గ్రూప్-1 పోస్టుల్లో 1:100 నిష్పత్తిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేసింది.
గురుకులాలకు కామన్ టైమ్‌టేబుల్
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ కామన్ టైమ్‌టేబుల్‌ను ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సొసైటీల్లో పనివేళలు, రోజువారీ సమయపాలన పట్టికలు వేర్వేరుగా ఉండడంతో విద్యార్థులతోపాటు సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఐదు గురుకులాల్లో ఒక్కో నిబంధన’ పేరిట నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి అన్ని గురుకులాలకు కామన్ టైమ్‌టేబుల్ నిర్ణయించి మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
గ్రేటర్ వరంగల్ బల్దియాలో కరెంట్ కటకట
గంటపాటు నిలిచిన పౌరసేవలు
వరంగల్, జూలై 3: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు గంటపాటు పౌరసేవలు నిలిచిపోయాయి. రోజూ వందలాది మంది వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వస్త్తుంటారు. మధ్యాహ్నం సమయంలో కరెంట్ లేకపోవడంతో పౌరసేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజాపాలన దరఖాస్తుల సవరణల కోసం రోజూ ఉదయం నుంచే వందలాది మంది ప్రధాన కార్యాలయ కౌంటర్ వద్ద బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో కరెంట్ లేక జనరేటర్ పనిచేయక పోవడంతో ఆన్లైన్ నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మతులు చేపట్టారు.