హైదరాబాద్: బాలాపూర్ బడా గణపతి (Balapur Ganesh) ఊరేగింపు కొనసాగుతున్నది. గణేషుడిని భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తున్నారు. అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు లడ్డూ వేలంపాట ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 16 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.
కాగా, ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. లడ్డూకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తొలిసారిగా నిర్వాహకులు వేలంలో కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిబంధనను తెచ్చారు. బాలాపూర్‌లో గణేషుడికి భారీ లడ్డూ నైవేద్యంగా పెట్టే సంప్రదాయం 1980లో మొదలైంది. లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. రూ.450తో ప్రారంభమైన లడ్డూ వేలం ఏయేడాది కాయేడు రికార్డు ధరల పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. గతేడాది స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నాడు. ఈ ఏడాది రూ.30 లక్షలు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.