హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్‌పేట, జూలై 26 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్‌పేట్‌లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం.. మూడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన గుడి. దేవాదాయధర్మాదాయ శాఖ పరిధిలో 6సీ కేటగిరీలో ఉన్నది. వందల ఏండ్లుగా నిత్యపూజాదికాలతో, స్థానికులకు కొంగుబంగారమై నిలిచిన దేవుడి భూములకు ఎసరొచ్చింది.
స్వామివారి భూములపై దళారులు కన్నేశారు. రూ.100 కోట్ల దేవుని మాన్యాన్ని అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వంలోని ఓ కీలక నేత కనుసన్నల్లో ఇప్పటికే మొరం పనులు కూడా మొదలయ్యాయని, కాగితాలపై అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని, త్వరలో వెంచర్ చేసి అప్పజెప్పేందుకు పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ నేతలు, స్థానిక పెద్దలు కలిసి చేస్తున్న కబ్జా కావడంతో లోగుట్టుగా అంతా సాగిపోతున్నది.
రంగారెడ్డి జిల్లాలో ఉన్న దేవాదాయశాఖకు సంబంధించిన వివాదాస్పద భూములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2022లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో బడంగ్పేట్ బాలాజీ వెంకటేశ్వర దేవాలయానికి చెందిన సర్వేనెంబర్లు 11, 12, 27, 55, 56, 57, 70 కూడా ఉన్నాయి. ఇందులోని 24.24 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఎవరికీ రిజిస్టేష్రన్ చేయవద్దంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చారు. ఇందులో సర్వేనెంబర్లు 11, 12, 55, 56, 70లోని ఉన్న 9.19 ఎకరాల భూమి విషయంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద కేసు రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్‌లో స్థితిలో ఉన్నది. సర్వే నెంబర్ 27లోని 2.29 ఎకరాల భూమి విషయంలో ఎం
డోమెంట్ ట్రిబ్యునల్‌లో కేసు రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ స్థితిలో ఉండగాa, కందుకూరు ఆర్డీవో వద్ద మరో కేసు పెండింగ్‌లో ఉన్నది. సర్వేనెంబర్ 57లోని భూమిపై హైకోర్టు అర్చకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు ఎండోమెంట్ 43 రిజిస్టర్లో నమోదైంది. 1989లో ఆలయ అర్చకులు ఈ భూమికి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అయితే దీనిని ఛాలెంజ్ చేస్తూ దేవాదాయశాఖ సింగిల్ ట్రస్టీని అపాయింట్ చేసి కోర్టులో కేసు వేసింది. అప్పటినుంచి ఈ భూమిపైనా వివాదం కొనసాగుతున్నది. ఇలా మొత్తం ఏడు సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయినా కొందరు వ్యక్తులు ఈ భూమిలో కొంత భాగాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
సర్వే నెంబర్లు 11, 12, 27ల్లో కలిపి సుమారు ఆరెకరాల భూమిపై దళారులు కన్నేసినట్టు సమాచారం. ప్రభుత్వంలోని ఓ కీలక నేత అండతో ఈ భూములను అమ్మకానికి పెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ భూమి వేర్వేరు చోట్ల ఉండటంతో వారికి అనుకూలంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల మొరం పోశారని సమాచారం. కాగితాలపైనే అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారని తెలిసింది. వెంచర్ చేయడానికి ముందే భూమిని కాగితాలపై అమ్మేస్తున్నారని బడంగ్‌పేటలో చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి ఈ భూములపై న్యాయ వివాదం కొనసాగుతుండగా ‘అంతా మేం చూసుకుంటాం’ అని కొనుగోలుదారులకు హామీ ఇచ్చి, అడ్వాన్సులు తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో కొందరు అర్చకులు కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూమి ఎకరం సుమారు రూ.20కోట్ల వరకు పలుకుతుందని, మొత్తంగా రూ.100 కోట్లకుపైగా భూమికి ఎసరు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి ఈ భూమిపై దేవాదాయ శాఖ పెత్తనం తొలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని, కీలకనేత ఆదేశాల మేరకు పని పూర్తి చేసేందుకు పావులు కదుపుతున్నట్టు దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్వోసీ ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. వెంటనే ప్రభుత్వ పెద్దలు స్పందించి, ఈ అక్రమాన్ని అడ్డుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఐదుతరాలుగా దేవుని సేవ చేస్తున్నాం. 1934లో ఇనాం కింద వచ్చిన భూములివి. వీటిపై మా కుటుంబానికే పూర్తి అధికారముంది. గతంలో మా దేవాలయం దేవాదాయశాఖ పరిధిలో లేదు. కానీ భూముల విషయం తెలిశాక బుక్ఆఫ్ఎండోమెంట్స్లో ఉందంటూ వారు కేసు వేశారు. ఆ తర్వాత కోర్టు కేసుల కోసం ఒక అధికారిని పెట్టారు. అంతే తప్ప మా దేవాలయం ఎండోమెంట్స్‌లో లేదు. దీనిపై హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మా దేవాలయంపై దేవాదాయశాఖ పెత్తనమేంటో అర్ధం కావడం లేదు. – జగన్మోహనాచార్యులు, ఫౌండర్‌ట్రస్టీ
ఆలయానికి పలు సర్వే నంబర్లలో కలిపి 24.24 ఎకరాల భూమి ఉన్నట్టు మా రికార్డుల్లో నమోదైంది. ఆరు ఎకరాల భూమి విషయంలో కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అవన్నీ దేవాలయానికి చెందిన భూములు. వీటి విషయంలో ఎవరూ తొందరపడి కొనుగోలు చేయవద్దు. అవి ఎప్పటికైనా దేవాలయానికే చెందుతాయి. భూముల వివాదం రంగారెడ్డి జిల్లా జేసీ కోర్టులో ఉన్నది.రంగారెడ్డి జిల్లాకలెక్టర్ ఇచ్చిన గెజిట్‌లో కూడా ఈ సర్వేనెంబర్లలో ఉన్న భూములు నిషేధిత భూములుగా ప్రకటించారు. కాబట్టి రిజిస్టేష్రన్లు కూడా జరగవు.
– శ్రీనివాసరావు, ఈవో