మామిళ్లగూడెం, మే 17: ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ రెబల్ అభ్యర్థి బక్కా జడ్సన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ.. ఈ నెల 15న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సభలో మల్లన్న మాట్లాడుతూ.. ‘నన్ను శాసనమండలికి పంపుతారా? లేకుంటే శ్మశానానికి పంపుతారా?’ అంటూ పట్టభద్రులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు.
దీనిపై తాను ఎన్నికల సంఘానికి, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ నెల16న ఖమ్మం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో దీక్షకు దిగినట్టు చెప్పారు. మూడు ఉమ్మడి జిల్లాలోని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించకపోతే నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు.
Tinmar Mallanna