హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): గోదావరిలో ఎవరూ ఊహించని రీతిలో వరద వస్తున్నదని, గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తని ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి చెప్పారు. ఇంతటి విపత్తులో పంప్‌హౌస్‌లు నీట మునగడం సహజమని స్పష్టంచేశారు. కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీటమునకపై పెంటారెడ్డి స్పందించారు. ‘నమస్తే తెలంగాణ’తో పలు విషయాలను వెల్లడించారు. ఎత్తిపోతల పథకాల్లో, జలవిద్యుత్తు ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు నీట మునగడం అతి సాధారణమని వెల్లడించారు.
గతంలో మన రాష్ట్రంలో 1998, 2008లో శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు, కల్వకుర్తి పంప్‌హౌస్ రెండు సార్లు నీట మునిగాయని గుర్తుచేశారు. 2009లో ఉత్తరాఖండ్‌లోని కోటేశ్వర జలవిద్యుత్తు ప్రాజెక్టు, 2004లో జమ్ముకశ్మీర్, ఆ తర్వాత కార్గిల్‌లోని చుతక్ జలవిద్యుత్తు ప్రాజెక్టులు నీటిమునిగాయని ఉదహరించారు. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించానని వెల్లడించారు. మోటర్లు, ఎలక్ట్రిక్, ఎలక్ట్రికల్ పరికరాలు నీటమునిగాయని, తద్వారా మోటర్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చిచెప్పారు. వరద ఉధృతి తగ్గిన అనంతరం నీటిని తొలగించి తిరిగి మోటర్లను ఆరబెట్టి వినియోగంలోకి తీసుకురావచ్చని స్పష్టంచేశారు. గతంలో కల్వకుర్తి పంప్‌లను నెలరోజుల వ్యవధిలోనే అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.