ధాన్య సిరిని చూసి మురిసిపోతూ.. అన్నదాత తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్ సర్కారు ఈసారి పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసింది. పండుగపూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సర్కారు ఒక్క ఎకరాకూ సాగునీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేక కకావికలమవుతున్నది. బరాజ్‌లు ఖాళీ అవడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేక పోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా, ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగు నీరందడం అనుమానంగా మారడంతో అన్నదాత ఆగమవుతున్నాడు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారింది. ఈ ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు..ఎంత ఖర్చుపెట్టినా దానికి సరిపోవడం లేదు. కాళేశ్వరం ద్వారా 16 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానని కేసీఆర్ సర్కారు ఏ ఏడాదిలోనూ 75వేల ఎకరాలకు మించి ఇవ్వలేదు. దీని కోసం ఏటా 25వేల కోట్ల ఖర్చు వస్తున్నది.
-రేవంత్‌రెడ్డి (జూలై 3,2023)
ఎనిమిదేండ్ల ఆదాయం, అప్పులు మొత్తం కాళేశ్వరానికి ధారపోశారు. కాళేశ్వరంతో రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలు సాగవుతుందని కేసీఆర్ సర్కారు చెప్పింది. కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు. కాళేశ్వరం మోటర్లు నీటమునిగి నిరుపయోగంగా మారాయి. బాహుబలి మోటర్లు మునిగిపోయాయి.రీడిజైనింగ్ పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్ వృథా చేశారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం కూడా లేదు.
-మల్లు భట్టి విక్రమార్క (జూలై 30, 2022)
కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తున్నది. ఇదొక ఫెయిల్యూర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ మార్చడం వెనుక రాజకీయ, ఇతర కోణాలున్నాయి.
-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Crop Holiday | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ సాగునీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు సత్యం బోధపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లేక కాంగ్రెస్ ప్రభుత్వం కకావికలమవుతున్నది. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చేందుకు వెనకాముందు ఊగిసలాడుతున్నది. బరాజ్‌లు ఖాళీ అవడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరివ్వలేక పోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా, ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నీటినిల్వల్లో 6 టీఎంసీలే తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది పూర్తిస్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం జంకుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 63.19 టీఎంసీల నీరు ఉన్నది. 6.50 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ స్టేజ్ -1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా, దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టును తగ్గించి, 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని నిర్ణయించారు. అందులో 3.87 ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరివ్వాలని ప్రతిపాదించింది.
గత యాసంగి సీజన్లో స్టేజ్ -1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు గాను 9,60,000 ఎకరాలకు సాగునీరందించారు. ఎస్సారెస్పీ స్టేజ్- 2 కింద 3,71,691 ఎకరాలు ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాలకు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికే ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత విధించారు. కడెంతోపాటు, సదర్మాట్ కింద క్రాప్ హాలిడేలను ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టును ప్రభుత్వం కొంత మేర తగ్గించింది. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టును పరిమితం చేసింది. ఇప్పుడు ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చే పరిస్థితి లేదని తెలుస్తున్నది.
గోదావరి బేసిన్లో ప్రస్తుతం ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టమవుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల లేకముందు ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ 2వ దశ సూర్యాపేట వరకు.. వరద కాలువ, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు కింద వానకాలం పంటకే దిక్కులేని దుస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయా ప్రాజెక్టుల కిం ద ఆయకట్టు కొత్త జీవం పోసుకొన్నది. రెండు పంటలకు భరో సా లభించింది. ఆయా ప్రాజెక్టు ల కింద ఉన్న చివరి మడి వరకు సాగునీరందేలా ప్రణాళికాబద్ధం గా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను కొనసాగించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానమైన ప్రాజెక్టులకు ఎక్కడ నీరు అవసరమైతే అక్కడికి అప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అందజేసింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా అనుసంధానమైన చెరువులన్నింటినీ క్రమం తప్పకుండా నింపుతూ వచ్చిం ది. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందేలా చూసింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. బరాజ్‌ల మరమ్మతుల కోసం నీటిని దిగువకు విడుదల చేశారు. పనులు పూర్తయ్యేవరకూ నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడిదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తున్నది. ప్రస్తుతమున్న నీటి నిల్వలు ప్రతిపాదిత ఆయకట్టుకు సరిపోవు. మరోవైపు లిఫ్ట్ చేసుకునే సౌలభ్యం కూడా లేదు. దీంతో ఆయకట్టుకు నీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది.
రాష్ట్రంలో గత మూడేండ్లుగా మేజర్, మీడియం ప్రాజెక్టుల కిందనే ఏటా దాదాపు 35 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది అది 28 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందులో యాసంగిలోనూ వెట్ క్రాప్స్‌కు ఎక్కువగా సాగునీటిని అందించారు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యమిచ్చారు. 2021-22 యాసంగిలో దాదాపు 19.81 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీటిని అందించగా, ఈ ఏడాది దానిని 11.57 లక్షల ఎకరాలకు కుదించారు. అదే సమయంలో గత ఏడాది యాసంగిలో కేవలం 13.84 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించగా, ఈ ఏడాది ఏకంగా 17.38 లక్షల ఎకరాలకు విస్తరించారు.
ఈ ఏడాది కృష్ణా బేసిన్‌కు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 130.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ
నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా, ఈ యాసంగిలో ఒక్క ఎకరాకూ నీరివ్వడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్లో సాగునీరివ్వలేని పరిస్థితి నెలకొన్నది. కేవలం నెట్టెంపాడు కింద 5 వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరివ్వాలని అధికారులు ప్రతిపాదించారు.