హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్12: ఏ తల్లి కన్నతో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కాకతీయ కాలువలో పడేసి వెళ్లిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువు అరుపులు విని పసికందు ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద జరిగింది. తుమ్మనపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి వంతెన వద్ద కాకతీయ కాలువలో అదే గ్రామానికి చెందిన గుంటేటి చొక్కారెడ్డి తన ట్రాక్టర్ను కడిగేందుకు వెళ్లాడు.
కాలువ లైనింగ్ వెంట పెరిగిన చిన్నపాటి చెట్టు వద్ద పసికందు ఏడుపు వినిపించింది. ఏడుపును గమనించిన ఆయన అటుగా వెళ్లి.. చుట్టూ దు స్తు లు చుట్టి సం చిలా ఉన్న మూ టను తెరిచి చూశాడు. అందులో ఏడుస్తూ ఉన్న మగ శిశువు కనిపించింది. వెంటనే గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. టౌన్ సీఐ తిరుమల్గౌడ్ వచ్చి పసికందును తన వాహనంలో హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.
బాబు జన్మించి 24 గంటలు అవుతుందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఏసీసీ శ్రీనివాస్ సైతం దవాఖానకు వెళ్లి శిశువు బాగోగుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు శిశువును మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.