బయ్యారం డిసెంబర్ 23: పుట్టబోయే బిడ్డ కోసం ఆమె ఎన్నో కలలు కన్నది.. కుటుంబమంతా సంబురపడిపోయింది.. తొందరలోనే ఇంటికి వారసుడు/వారసురాలు రాబోతున్నారని ఆనందపడ్డారు. కానీ, వారి ఆనందాన్ని విధి ఆవిరి చేసింది. పురిట్లోనే శిశువు కన్నుమూసింది. బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియకముందే అనారోగ్యంతో తల్లి కూడా చనిపోయింది. వీరిద్దరి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో బాలింత నానమ్మ కూడా మృతిచెందింది. ఈ ఘోర విషాదం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో గురువారం చోటుచేసుకొన్నది. తండాకు చెందిన ధరంసోత్ మోహన్ భార్య రేణుక తొమ్మిది నెలల గర్భిణి. నాలుగు రోజుల క్రితం జ్వరంతో పాటు నొప్పులు రావటంతో మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. గురువారం పరిస్థితి విషమించటంతో ఖమ్మంలోని ఓ దవాఖానకు తరలించారు. అక్కడ పురిట్లోనే శిశువు మృతి చెందగా, కాసేపటికే అనారోగ్యంతో తల్లి రేణుక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు తల్లీబిడ్డల మృతదేహాలను రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. మనమరాలితోపాటు శిశువు మృతిని తట్టుకోలేక రేణుక నానమ్మ బోడ జాంకీ (80) కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఒకే కుటుంబంలో, ఒకే రోజు ముగ్గురు మృతి చెందటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.