e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ దళిత బంధు కొత్తది కాదు

దళిత బంధు కొత్తది కాదు

  • ఆర్నెళ్ల క్రితమే అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన
  • బడ్జెట్‌లోనూ రూ.1000 కోట్ల కేటాయింపు
  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకం కొత్తది కాదని, ప్రభుత్వం ఆరు నెలల క్రితమే రూపొందించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. దీనిపై అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారని, రూ.1000 కోట్లు కూడా కేటాయించారని గుర్తు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన సాంసృతిక సారథి కళాకారుల అవగాహన సదస్సులో వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని దళితుల విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం మేథోమథనం చేసి దళిత బంధు పథకానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారని చెప్పారు.

ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా దళిత్‌ ఎంపవర్‌మెంట్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారని అన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి వల్ల పథకం అమలులో జాప్యం జరిగిందని వినోద్‌ కుమార్‌ చెప్పారు. గత ప్రభుత్వాల్లో దళితులకు మద్దతు లభించలేదని, ఇవాళ ఢిల్లీ సెంట్రల్‌ యూనివర్సిటీలో 200 సీట్లు సాధించేస్థాయికి మన దళిత బిడ్డలు ఎదిగారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిదని, స్వరాష్ట్రం సిద్ధించగానే సాంసృతిక సారథి సంస్థ ద్వారా కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకుతుందని అన్నారు.

- Advertisement -

దళితబంధులో ఇస్తున్న రూ.10 లక్షలతో ఎలా బతకొచ్చనే సూచనలను మీ పాటల్లో చెప్పాలని కళాకారులకు సూచించారు. ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి సంస్థ చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ దళిత బంధుపై కళారూపాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎలాగైతే ధూం ధాం చేశామో, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయ సాధన కోసం దళిత బంధుపైనా అదే స్థాయిలో ధూంధాం చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఒక సోషలిస్టు అన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేయడం కేసీఆర్‌ దృష్టిలో చాలా చిన్న విషయం అన్నారు. దళిత బంధు కేసీఆర్‌ మనసులో నుంచి వచ్చిన పథకమని, దేశంలో మౌలిక మార్పునకు ఇది సంకేతం అని చెప్పారు. కార్యక్రమంలో సాంసృతిక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి దళిత బంధుపై ధూంధాం ప్రచారం
దళిత బంధుపై రాష్ట్రవ్యాప్త ప్రచారాని తెలంగాణ సాంస్కృతిక సారథి పాటలను సిద్ధం చేసింది. పథకం ఉద్దేశం, లక్ష్యాన్ని ప్రజలకు వివరించేలా 20 పాటలను సిద్ధం చేసింది. దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న హుజూరాబాద్‌ నియోజకర్గంలోనే తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళారూపాలు, కళాకారుల ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నెల 3 (మంగళవారం) నుంచి మండలానికి రెండు బృందాల చొప్పున కళాకారులు ప్రతి గ్రామం, ప్రతి గడపకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని రెండు పట్టణాలు, ఐదు మండలాల్లో మొత్తం 210 మంది కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రత్యక్ష కళారూపాలతో పాటు ఆడియో, వీడియో సాంగ్స్‌ రూపంలోనూ ప్రచారం చేసేలా ఏర్పాట్లు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana